V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –గన్నవరం సెప్టెంబర్ 30:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం విలస గ్రామంలో బాణాసంచా పేలి ఇరువురు మృతి చెందిన ఘోర ప్రమాదం పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కిరాణా షాపులో దీపావళి మందు సామాగ్రి పేలి భార్యాభర్తలు మృతి చెందడం, వారి కుమారుడికి తీవ్రగాయాలు కావడం పట్ల మంత్రి సుభాష్ విచారం వ్యక్తం చేశారు. విలస గ్రామానికి చెందిన
కంచర్ల శ్రీనివాసరావు (50), సీత (48) లు మందు గుండు సామాగ్రి పేలి మృతి చెందిన విషయం తనను కలిసి వేసిందని ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారి కుమారునికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ తో మంత్రి మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెవిన్యూ పోలీస్ అధికారులు చర్యలు గైకొనాలని ఆదేశించారు.