పెన్షన్ల కోతతో అవ్వా తాతల ఉసురు తీస్తున్న కూటమి సర్కార్
దివ్యాంగులను కూడా మోసం చేస్తున్నారు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 21:
అవ్వా తాతలను పెద్ద కొడుకు లాగా ఆదుకుంటాం, నాలుగు వేల పెన్షన్ ఇస్తాం! దివ్యాంగులకు అండగా నిలబడతాం, అంటూ ఊదరకొట్టి ఇప్పుడు కూటమి సర్కార్ వాళ్లకు దారుణమైన పరిస్థితులు కల్పిస్తోందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ ఆమె పార్టీ కార్యాలయం నుండి గురువారం తీవ్రంగా విమర్శించారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నడూ చూడని విధంగా అర్హులైన పెన్షన్ దారులకు మానవీయ దృష్టికోణంలో చూసి వారిని గుర్తించి ప్రతీ నెల 66.34 లక్షల మందికి నిరాటంకంగా పెన్షన్ అందజేయగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందులోంచి 4 లక్షల మందిని తొలగించి వారి ఉసురు తీస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 8.20 లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్లను ఇవ్వగా, ఇప్పుడు బాబు గారు వారికి కూడా అన్యాయం చేసేందుకు సిద్ధం అయ్యారని చింతా అనురాధ పేర్కొన్నారు. పెన్షన్ల తగ్గింపులో భాగంగా మళ్లీ వికలత్వ పరీక్షలు నిర్వహించి వైకల్య శాతం తగ్గించి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో గుబులు మొదలైందని, కొందరికి వచ్చే నెల నుంచి పెన్షన్ రాదని తెలుసుకుని వారు చాలా బాధ పడుతున్నట్లు అనురాధ వివరించారు.
ఎన్నికలకు ముందు దివ్యాంగులకు పెన్షన్ రూ. 6 వేలు, ఇంట్లో మంచం మీద ఉన్న వాళ్లకు రూ. 15 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేలు అంటూ ఊరించి ఇప్పుడు వారిని మోసం చేయడం సరైంది కాదని, వెంటనే ఈ చర్యలను ఆపి, ప్రభుత్వం అర్హులైన పెన్షన్ దారులను పూర్తిగా ఆదుకోవాలని అనురాధ డిమాండు చేసారు.