

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 17:

అఖిల పక్ష బృందాలు వెళ్లిన అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు తెలిపాయి…
పాత్రికేయ సమావేశంలో వెల్లడించిన ఎంపీ హరీష్ బాలయోగి…
కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్ర దాడులను అన్ని దేశాలు ఖండించాయని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు.అమెరికా,పనామా,గయానా,బ్రెజిల్,కొలంబియా దేశాలకు అఖిల పక్ష ప్రతినిధుల బృందంలో సభ్యునిగా పర్యటన అనంతరం అమలాపురం తిరిగి వచ్చిన హరీష్ నేడు సత్యనారాయణ గార్డెన్స్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల పక్ష బృందాలు వెళ్లిన దేశాలన్నీ భారతదేశానికే మద్దతు తెలిపాయని చెప్పారు.పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలు ఎండగట్టేందుకు విదేశీ బృందంలోని సభ్యుడైన ఎంపీ గంటి హరీష్ బాలయోగి బృందం ఆదివారం న్యూయార్క్ నగరం చేరుకున్నారని తెలిపారు.డాక్టర్ శశి థరూర్ నేతృత్వంలోని ఈ బృందం 11 సెప్టెంబరు 2001లో, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల ముఖ్యమైన ప్రభుత్వ, వాణిజ్య స్థానాలపై చేసిన దాడులలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మారక చిహ్నన్ని మరియు మ్యూజియం ను సందర్శించి స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారన్నారు.న్యూయార్కు పర్యటన ముగించుకుని గయానా దేశం చేరుకున్న విదేశీ అఖిల పక్ష బృందానికి ఆ దేశంలో నివసించే భారతీయులు ఘనంగా స్వాగతం పలికరన్నారుహరీష్ బాలయోగి తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ భారత ఎంపీల ప్రతినిధి బృందం గయానా మాజీ అధ్యక్షుడు (2000-2012) మరియు ప్రస్తుత ఉపాధ్యక్షుడు భరత్ జగ్డియోతో అధ్యక్ష భవనంలో అద్భుతమైన సమావేశం జరిగినట్లు తెలిపారు.ఇటీవలి సంఘటనల నేపథ్యంలో భారతదేశం యొక్క ఆందోళనల పట్ల ఆయన బలమైన సానుభూతి వ్యక్తం చేశారన్నారు.
పనామా దేశ అధ్యక్షుడు జోస్ రౌలి ములినో తో అఖిల పక్ష బృందం సమావేశమైనట్లు బృంద సభ్యులు హరీష్ తెలిపారు. ఈ సమావేశంలో ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్ లోని పహల్గాం లో జరిపిన మరణకాండ గూర్చి అలాగే ఆపరేషన్ సింధూర్ గూర్చి ములినో కు వివరించినట్లు చెప్పారు.ఉగ్రవాదంపై భారతదేశం తీసుకున్న స్పష్టమైన,నైతికమైన నిర్ణయానికి పనామా దేశ ప్రభుత్వం స్పందన ప్రశంసనీయమైనదని తెలిపారు.ఉగ్రవాదాన్ని ఖండిస్తూ దేశ,ప్రపంచ దేశాల భద్రత కోసం భారతదేశం తీసుకుంటున్న చర్యలకు అధ్యక్షుడు ములినో సంపూర్ణ మద్దతు ప్రకటించారని హరీష్ తెలిపారు.
ఉగ్రవాదం పై పోరులో అమెరికా సంయుక్త రాష్ట్రాల మద్దతు భారతదేశానికి ఉందని ఉగ్రవాదం పై పోరులో దేశ వాణిని వినిపించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేమ్స్ డేవిడ్ వాన్స్ తో భేటీలో ఈ విషయాన్ని ప్రకటించినట్లు చెప్పారు.ఆపరేషన్ సింధూర్ ను గూర్చి పూర్తిగా ప్రత్యక్షంగా వివరించడం జరిగిందన్నారు.ఎందుకు ఎదురు దాడి చేయాల్సి వచ్చిందో అక్కడి సెనేటర్స్ కు కూడా తెలిపినట్లు చెప్పారు.అమెరికా దేశ మద్దతు పూర్తిగా భారత దేశానికి ఉంటుందని డేవిడ్ వాన్స్ స్పష్టంగా తెలిపారని హరీష్ తెలిపారు.అలాగే కొలంబియా దేశం వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రతినిధులకు పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన విధానాన్ని వివరించామని పహల్గాంలో 26 మందిని ఏ విధంగా పొట్టనపెట్టుకున్నారో వివరించామన్నారు.అనంతరం ఎదురు దాడి చేయాల్సిన పరిస్థితితులను తెలిపామన్నారు.కొలంబియా దేశ ప్రభుత్వం పాకిస్థాన్ లో మరణించిన వారికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపిన పోస్ట్ ను ఉపసంహరించుకుందని కొలంబియా దేశం మనకు మద్దతు అని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ అని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.