

నా జీవితం ప్రజా సేవకే అంకితం..
పేదరికంపై నిరంతర పోరాటం

పేదరికం చదువుకు అడ్డుకారాదు
పాలకునిగా కాదు.. సేవకునిగా పనిచేస్తా
పండుగలా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు
పెద్ద ఎత్తున తరలి వచ్చిన అధికారులు, కూటమి పార్టీ నాయకులు,ప్రజలు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, జూన్ 17:

సుభాష్ అంటే శభాష్ అంటూ ..పుట్టినరోజు నాడు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజానీకం మంత్రి సుభాష్ ను కొనియాడుతున్నారు. మంత్రి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ…నా ఈజీవితం ప్రజా సేవకే అంకితం.. పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రజలుకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని, పేదరికంపై నిరంతరం పోరాటం చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం మంత్రి సుభాస్ జన్మదిన వేడుకలు వెంకటయపాలెంలోని పేపకాయల బాబ్జి కళ్యాణ మండపంలో పండుగలా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూటమి పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి అభినందనలు తెలియజేశారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున తరలివచ్చి తన అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ తన పట్ల ప్రేమాభిమానాలు చూపించి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హోదా తనకు అలంకారం కాదని, ప్రజలకు సేవ చేసుకొనే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను అన్నారు. పేదలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.

రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పి 4 కార్యక్రమం ప్రవేశ పెట్టిన సీఎం ఆశయం మేరకు 63 మంది పిల్లలను దత్తత తీసుకొని, ఉన్నత చదువులు చదివించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానని నిండు సభలో ప్రకటించారు. పేదరికం వల్ల ఏ ఒక్కరు చదువు ఆగకూడదని, తన పిలుపుకు స్పందించి పేద విద్యార్థుల చదువు కోసం దాతలు రూ. 20 లక్షల రూపాయలు విరాళం అందించడం ఆనందకరమన్నారు. పేదరికం నిర్మూలన, నిరుద్యోగం నిర్మూలను, ఉపాధి కల్పన తన లక్ష్యమన్నారు. తన జన్మదిన పురస్కరించుకొని 63 మంది విద్యార్థులను దత్తత తీసుకొని వారికి ఉద్యోగం వచ్చేవరకు చదివిస్తామన్నారు. రామచంద్రపురం నియోజవర్గంలో హృదయ సంబంధిత హాస్పిటల్ నిర్మాణం కోసం ఉప్పు మిల్లి గ్రామానికి చెందిన యాళ్ల కుటుంబ సభ్యులు సుమారు 50 లక్షల విలువచేసే 50 సెంట్లు స్థలం దానం ఇవ్వడం సంతోషకరమన్నారు.

అలాగే 8 మందికి బడ్డీ కొట్లు, ఇద్దరు నిరుపేదలకు ఇల్లు కట్టించే బాధ్యత, ఎనిమిదిమందికి హార్ట్ ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయం తీసుకున్నాను అన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా భవిష్యత్తు ప్రణాళిక చేపట్టానన్నారు. అలాగే రామచంద్రపురం శిరోముండనం బాధితుడుకి కుల సర్టిఫికెట్ ఇప్పించామని, అలాగే ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. సిఎస్ఆర్ నిధులతో త్వరలో రామచంద్రపురంలో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం చేపడతామన్నారు. సమాజ సేవలో, సమాజ హితం కోరుతూ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవకే తన జీవితం అంకితమని వెల్లడించారు. అనంతరం దత్తత తీసుకున్న పిల్లల సమక్షంలో మంత్రి సుభాష్ కేకు కోసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
