V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
రామచంద్రపురం, మే 12,2025

ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉచిత ఉపకరణాలను పంపిణీ చేశారు. సోమవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం రూరల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో రామచంద్రపురం నియోజకవర్గంలోని భవితా కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఆలింకో సంస్థ ద్వారా ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని కే గంగవరం రామచంద్రపురం మండలాల పరిధిలో సుమారు 46 మంది పిల్లలకు ఆలింకో, సమగ్ర శిక్ష ద్వారా వీల్ చైర్లు, ఎలక్ట్రిక్ మోపెట్ లు, బ్రెయిలీ కిట్లు, వినికిడి పరికరాలు తదితరాలను మంత్రి పిల్లలకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అవసరమైన పరికరాలను అందజేసిన ఆ లింకో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.కూటమి ప్రభుత్వంలో సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ప్రతి నెల 15 వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అందిస్తుందన్నారు.

మంచానికే పరిమితమైన వ్యక్తులకు మరొకరి సహాయం అవసరమవుతున్న నేపథ్యంలో పూర్తిగా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం 15000 రూపాయలు పింఛను అందించడం జరుగుతుందన్నారు. మరిన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చి ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, రామచంద్రపురం ఎంపీడీవో పద్మజ్యోతి, రామచంద్రపురం ఎంఈఓ వీర రాఘవరెడ్డి కే గంగవరం ఎంఈఓ నాగరాజు, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తాళ్లపొలం -ఆదివారపు పేట బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సుభాష్

తాళ్లపొలం ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఆదివారపుపేట వరకు కోటి రూపాయల అంచనా విలువతో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ఆదివారపు పేట గ్రామంలో శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులు పూర్తచేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏ ఈ యేసురత్నం రామచంద్రపురం ఎంపీడీవో పద్మజ్యోతి ఆదివారపు పేట సర్పంచ్ దొరబాబు, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.