V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం డిసెంబర్ 20:
జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న వివిధ పంటల రాబడిలో 60 శాతం రుణాన్ని పొందే విధంగా రుణపరిమితులను నిర్ధారించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టరేట్ నందు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ 2025- 26 సమావేశాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యాన పశు వర్ధనం, మత్స్య, శాఖలకు సంబంధించిన రుణ పరిమితులను జిల్లా స్థాయిలో సాంకేతిక కమిటీ ప్రతిపాదించిందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడి, ఉత్పాదక వ్యయం, ఇన్ ఫుట్ ధరల పెరుగుదల వంటి అంశాల ఆధారంగా తీసుకుని 2025-26 సంవత్సరానికి రైతులకు అందించే రుణ పరిమితులను ప్రతిపాదించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, కొబ్బరిలో అంతర్ పంటలు అరటి, కూరగాయలు, పాడి, కోళ్ల పరిశ్రమ, మత్స్య సాగు కార్యకలాపాలు చేపట్టే రైతులకు ఉత్పాదక వ్యయం, నర్సరీ వర్కింగ్ క్యాపిటల్ మరియు రాబడులు ఆధారంగా బ్యాంకుల ద్వారా అందించే రుణ పరిమితులను ఆయా శాఖల జిల్లా అధికారులు కమిటీకి వివరించారు. ఉత్పాదక వ్యయంలో కనీసం 60 శాతం పంట రుణాలుగా అందించేందుకు ఆయా అంశాల క్రింద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిమితులను కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రధానంగా వరి పంటకు సంబంధించి ఎకరాకు ఖరీఫ్ లో 49, 820 రూపాయలుగా, రబీలో 56,262 రూపాయలుగా రుణ పరిమితులుగా నిర్ణయించారు. జిల్లాలో రైతులు పండించే వ్యవసాయ ఇతర వాణిజ్య పంటలకు, మత్స్య రంగంలో రొయ్యలు, చేపలు సాగుకు గత ఏడాది నిర్వహించిన పెట్టుబడి మొత్తాలను సవరించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యంగా మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ రుణ పరిమితులను ఈ సంవత్సరం పెరిగిన ఉత్పాదకత వ్యయాలు, రాబడులను మరొక్కమారు నిశితంగా అధ్యయనం చేసి రుణ పరిమితులను నిర్ధారిస్తూ రాష్ట్రస్థాయి కమిటీకి సిఫార్సు చేయాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పశు కేసీసీ లబ్దిదారులకు పాడి గేదే ఒక్కంటికి లక్ష ఇరవై వేలు, పాడి ఆవులకు లక్ష రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ గా నిర్ణయించారు. గేదెలు, ఆవులకు పాలిచ్చే సమయం, నాట్ మిల్కింగ్ సమయాలను దృష్టిలో ఉంచుకొని నిర్వహణ కొరకు రుణ పరిమితులను కచ్చితంగా నిర్ధారించాలన్నారు. జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిమితుల ప్రతిపాదనలన్నింటిని క్రోడీకరించి రాష్ట్ర కమిటీ ఆమోదానికి పంపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. మొక్కజొన్న రబీలో సాగుకు ఎకరాకు 35, 850 రూపాయలు గాను, పప్పు దినుసులు సాగుకు ఎకరాకు 22, 700 రూపా యలు గాను రుణ పరిమితిని ప్రతిపాదించడం జరిగిందన్నారు. పూల సాగుకు రుణ పరిమితులు నిర్ణయించడం జరిగిందని మేజర్ క్రాప్ ఫిష్ ప్రొడక్షన్ కు రెండున్నర లక్షల వరకు రుణ పరిమితిగా తీసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. కొబ్బరి సాగుకు సంబంధించి నిర్వహణ ఎరువులు, ఫ్లవిoగ్, కోకో కూరగాయలు వంటి అంతర పంటల సాగు వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని అన్నింటికీ కలిపి రుణ పరిమితులు నిర్ధారించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో అరటి సాగుకు సంబంధించి కూడా మరొకసారి రుణ పరిమితులను పరిగణనలో తీసుకుని అధ్యయనం చేస్తూ నిర్ధారించాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీసీబీ కార్యనిర్వహక అధికారి ఆర్.వి.నరసింహరావు, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, జిల్లా పశుసంవర్ధక శాఖ వెంకట్రావు, జిల్లా మత్స్య శాఖ అధికారి ఎన్ శ్రీని వాసరావు, జిల్లా ఉద్యాన అధికారి బి వి రమణ, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్, స్వామి నాయుడు, లీడ్ బ్యాంకు మేనేజర్ కేశవ వర్మ ఎస్బీఐ డీప్యూటి రీజనల్, అధికారులు, ఇతర బ్యాంకుల అధికారులు, అభ్యుదయ రైతులు, డీసీసీబీ బ్యాంకు సిబ్బంది ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.