రామచంద్రపురం, డిసెంబర్ 17/24: ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసేలా ఎంటర్ప్రెన్యూవర్షిప్ అభివృద్ధి కార్యక్రమం (ఎంటర్ప్రెన్యూవర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) ను డిసెంబర్ 22న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,రామచంద్రాపురంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ తెలిపారు.

రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరణ చేయడం అనే అంశంపై మండలంలోని సర్పంచులు, మండల స్థాయి అధికారులు ,పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి డిసెంబర్ 17 నుంచి 18 వరకు రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం ముఖ్యఅతిథిగా పాల్గొని శిక్షణా తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర విజన్ -2047 లక్ష్యసాధనలో భాగంగా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ను తయారు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఆధారిత నైపుణ్య కల్పనకు భరోసానివ్వనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా డిసెంబర్ 22 న రామచంద్రపురం విఎస్ఎన్ కాలేజ్ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు సుమారు 1054 చిన్న పరిశ్రమలకు సంబంధించి రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని రకాల అనుమతులు, బ్యాంకు లోన్లు మంజూరు చేయించడానికి ప్రత్యేకంగా అనుభవజ్ఞులైన పది బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. వారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి తోడ్పాటు అందిస్తారన్నారు.

ఆర్థిక స్తోమత ఉండి ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పాలి ,ఎలా నెలకొల్పాలో ఆలోచన లేనివారు, ఆలోచనలు ఉండి ఆర్థిక స్తోమత లేని వారు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై తమ తమ ఆలోచనలు పంచుకోవాలని మంత్రి కోరారు.

రామచంద్రపురం నియోజకవర్గంలో మొదట విడత లో భాగం గా కనీసం 200 మంది చేత చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నామని.. ఇప్పటికే 40 మందిని ఎంపిక చేసామని .. మరో 160 మందిని ఎంపిక చేయాల్సి ఉందని.. ఒత్సాహికులు డిసెంబర్ 22 ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రానున్న ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అధికారులందరూ తమ తమ విధుల్లో అలసత్వం వహించవద్దని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఎంపీడీవో రాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, గ్రామ సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
