
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం,ఫిబ్రవరి 28,2025

పింఛనుదారులతో పింఛను పంపిణీ చేసేటప్పుడు సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ అమరావతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పింఛన్ల పంపిణీ, వేసవి నేపథ్యంలో తాగునీటి సరఫరా, ఎం ఎస్ ఎం ఈ సర్వే, ప్రభుత్వం అందిస్తున్న పథకాల కు సంబంధించి ప్రజల ఫీడ్బ్యాక్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. అమలాపురం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశ అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందిస్తోందని.. పింఛన్లను పంపిణీ చేసే సమయంలో పింఛనుదారులతో పించను అందించే సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. పింఛన్లను ఒక ప్రణాళిక ప్రకారం పంపిణీ చేయాలన్నారు. ప్రతినెల మొదటి రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛన్ పంపిణీ చేయాలన్నారు. మిగిలిన వారికి తరువాత రోజున పంపిణీ చేయాలన్నారు.పనులకు వెళ్లే వారికి మొదటిగా పింఛన్ ఇవ్వాలన్నారు. పింఛన్ పంపిణీ విషయంలో నూతనంగా అభివృద్ధి చేసిన అప్లికేషను ఉపయోగించి పింఛనుదారుడికి ఇంటి వద్ద పింఛన్ పంపిణీ చేయాలన్నారు. పింఛన్ ఇంటివద్ద అందివ్వలేని పక్షంలో దానికి గల కారణాలను సంబంధిత యాప్లో నమోదు చేయాలన్నారు. రానున్న వేసవి సీజన్లో జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమ్మర్ కంటిన్జెన్సీ ప్లాన్ లో భాగంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపడం, బోర్ బావులను ఎక్కువ లోతు చేయడం, బోరు బావులలో పూడిక తీయడం, అవసరమైన చోట ప్రైవేటు నీటి సోర్సులను గుర్తించడం వంటివి చేయాలన్నారు. పైవేవీ వీలుకాని పక్షంలో వాటర్ ట్యాంకుల ద్వారా సురక్షితమైన నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించడం జరుగుతుందని.. అధికారులు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిషాంతి, పిడి డిఆర్డి డాక్టర్ శివశంకర ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పి ప్రసాద్, పిడి డ్వామా మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.