శత జయంతి వేడుకలో మంత్రి వాసంశెట్టి సుభాష్.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రామచంద్రపురం,డిసెంబర్ 25: దేశంలో రాజకీయాలకి వన్నె తెచ్చిన రాజ నీతిజ్ఞుడు, భారతదేశ పూర్వ ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా బుధవారం రామచంద్రపురంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ వాజపేయి మానవతా విలువలు, అంకిత భావం,గొప్ప ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తిగా కొనియాడారు. వ్యక్తిత్వం, సమర్థత, అనుభవం కలగలిపిన అజాత శత్రువుగా భారతదేశ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తన సహచరుడు, బిజెపి అగ్రనేత ఎల్కే అద్వానీ పరస్పర సహకారంతో భారతీయ జనతా పార్టీని స్థాపించి సమర్థవంతుడైన నాయకునిగా, భారతదేశ ప్రధానిగా పాలన అందించి దేశ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించారన్నారు. విలక్షణ రాజకీయ దురందరుడిగా, సాహిత్యాభిలాషిగా, పాత్రికేయునిగా, బహుభాషా కోవిదుడుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించు కున్నారన్నారు. అలాగే 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గెలుచుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మహనీయుని స్మరించుకోవడం ఆనందకరమన్నారు. నేటితరం రాజకీయ నాయకులు స్వర్గీయ వాజపేయి ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
