
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
రామచంద్రపురం, మార్చి 24:

ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ తెలిపారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని సోమవారం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్, డ్రైన్స్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, రైతులతో మంత్రి సమావేశమై రామచంద్రపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం పంట పొలాలు ఈనిక దశలో ఉన్నాయని.. సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్క ఎకరం కూడా ఎండడానికి వీలు లేదన్నారు. గతంలో డ్రైనేజీలు, కాలువలను పట్టించుకోకపోవడంతో గుర్రపు డెక్క,పూడిక తో నిండి అధ్వానంగా తయారయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైనేజీలు కాలువలను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అధికారులు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. రైతు 10 వేళ్ళు మట్టిలో పెడితేనే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయని గుర్తు చేశారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అధికారులకి రైతులకి మధ్య వారధిలా పని చేయాలన్నారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు క్షేత్రస్థాయిలో ఎక్కడ నీరందడం లేదో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాగునీటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల నుంచి గతంలో ఉన్న సమస్యలను అధిగమించి అందరూ కష్టపడి పని చేస్తున్నారన్నారు. ఎక్కడో కొన్నిచోట్ల శివారు భూములకు నీరందకపోతే మండలమంతా సాగు నీరందడం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారని అది తగదని హితవు పలికారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు మెరుగ్గా పనిచేస్తున్నాయని.. ఇంకా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించే విధంగా నిధులు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ రామకృష్ణ, డ్రైన్స్ డీ ఈ పోచరావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాజులూరు, రామచంద్రపురం, ఎర్ర పోతవరం, కోటిపల్లి అధ్యక్షులు ఎల్ కృష్ణ చైతన్య, ఎం సత్యనారాయణ రెడ్డి, ఎన్ సుబ్రహ్మణ్యేశ్వర రావు , విజయరామరాజు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.