V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
అమలాపురం మార్చి 17:

ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి గ్రీవెన్స్ కార్యక్రమంలో అందే అర్జీలను నాణ్యతతో రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టీ నిషాంతి, డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి, పిడి డిఆర్డిఏ డాక్టర్ శివ శంకర్ ప్రసాద్, పిడి డ్వామా మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణమూర్తి అర్జీదారుల నుండి సుమారుగా 270 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులందరూ గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి తప్పకుండా వ్యక్తిగతంగా అర్జీలను ఓపెన్ చేసి చూడాలన్నారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకోవడం, క్షేత్రస్థాయిలో అర్జీదారుని వద్దకు వెళ్లి సమస్య గురించి మాట్లాడడం, సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలాన్నారు. రాష్ట్రస్థాయిలో ఆడిట్ టీములు అర్జీదారులకు ఫోన్ చేసి అర్జీల పరిష్కారం పై సంతృప్తి చెందారా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారని.. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

మండల, డివిజన్ స్థాయిలో కూడా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు జిల్లా కేంద్రానికి రావలసిన అవసరం లేకుండా ఆయా మండల , డివిజన్ కేంద్రాలలో అర్జీలను సమర్పించి పరిష్కార మార్గాలు పొందొచ్చన్నారు.

ఈనెల మార్చి 24,25 న అమరావతిలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి శాఖల వారీగా సంబంధిత శాఖలలో ఉన్న సమస్యలను నివేదిక రూపంలో కలెక్టరేట్కు సమర్పించాలన్నారు.ఈ నెల 18 నుంచి 20 వరకు శాఖల వారీగా జిల్లా స్థాయిలో సమీక్షించి జిల్లాలోని ప్రధాన సమస్యలను కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.

అంతకుముందు అమలాపురం రూరల్ మండలం చింతాడ గరువు ఎంపీటీసీ శ్రీమతి మోటూరి కనకదుర్గ, మోటూరి వెంకటేశ్వరరావు దంపతులు అమలాపురం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ ప్రారంభించారు. గ్రీవెన్స్ కార్యక్రమం లో వినతులు సమర్పించడానికి వచ్చిన అర్జీదారులకు కలెక్టర్ మజ్జిగను అందించారు. గత 3 సంవత్సరాలుగా వేసవిలో కలెక్టరేట్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న కనకదుర్గ, వెంకటేశ్వర రావు దంపతులను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, డిసిహెచ్ఎస్ కార్తీక్, సిపిఓ వెంకటేశ్వర్లు, ఎస్ ఈ ఆర్డబ్ల్యూఎస్ సిహెచ్ ఎన్ వి కృష్ణారెడ్డి, డిపిఓ శాంత లక్ష్మి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.ప్రసాద్, ఎస్ ఈ పిఆర్ రామకృష్ణారెడ్డి , జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.