V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-రామచంద్రపురం, జనవరి 7:
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అధ్యక్షతన రామచంద్రపురం పట్టణ కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజవర్గంలో పార్టీ సభ్యత్వాలు 55 వేలకు పైగా, పట్టణంలో 11 వేలకు పైగా నమోదు చేసుకుని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుంది అన్నారు. రామచంద్రపురం పట్టణంలో కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. స్థానికంగా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తిస్తామని, ఎవరూ నిరాశ చెందనవసరం లేదన్నారు. పార్టీ సభ్యత్వాలు నమోదు లోనూ, పిఏసి సంఘాల ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీలో అందరూ కుటుంబ సభ్యుల వలే కలిసిమెలిసి ఉండాలని కోరారు. త్వరలోనే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి , పార్టీని గ్రామ గ్రామాన మరింత బలోపేతం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీకు కార్యకర్తలే బలమని, ఎల్లప్పుడూ కార్యకర్తల వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.