
అంబరాన్ని తాకేలా సంక్రాంతి ఉత్సవ్ 2కె25 మెగా సంబరాలు
•వి ఎస్ ఎం కళాశాల వేదికగా మెగా సంబరాలకు శ్రీకారం.
రామచంద్రపురం, జనవరి 6, ప్రజా ఆయుధం ::
మన సంస్కృతీ సాంప్రదాయాలను భావి తరాలకు అందించి వాటిని సంరక్షించాలనే సంకల్పంతో జనవరి 12 నుంచి 14 వరకూ రామచంద్రపురంలోని వి ఎస్ ఎన్ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి ఉత్సవ్ 2కె25 పేరుతో మెగా సంబరాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖామంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవ్ 2కె25 గోడ పత్రికను ఆవిష్కరించారు. మంత్రి సుభాష్ మీడియా తో మాట్లాడాతూ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైనదన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టతను భావితరాలకు తెలియజేయడంతో పాటు, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సంక్రాంతి ఉత్సవ్ 2కె25 వేడుకలు భోగి మంటలతో ప్రారంభమై మహిళా మణులకు రంగవల్లుల పోటీలు, యువతీ యువకుల కోసం సంగీత విభావరి, పిల్లల మనసును దోచే చూడ చక్కని ఆటలు, గోదావరి జిల్లాల ఆత్మీయ ఆతిథ్యాన్ని అందరికీ పరిచయం చేసేలా రకరకాల పిండి వంటలు, చిన్నారులకు పతంగులు ఉంటాయన్నారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు,జబర్దస్త్ కామెడీ షోలు వంటి వినోదభరితమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజుల పండగ సంబరాల కార్యక్రమాల పూర్తి వివరాలు సోషల్ మీడియాలో తెలియజేస్తామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు ఐక్యతతో, సుఖ సంతోషాలతో జీవించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నారు. అంబరాన్ని అంటే ఈ మహా సంక్రాంతి వేడుకల్లో మహిళలు, పిల్లలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని, మరుగున పడుతున్న మన సంస్కృతీ సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు వారసత్వంగా అందించే ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో కూటమి మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి సుభాష్ కి కృతజ్ఞతలు తెలిపారు.