
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం, 4 అక్టోబర్ 2025:
స్వీయానుభూతితో, సహానుభూతితో బడుగు భాస్కర్ జోగేష్
రాసిన కవిత్వంలో సౌందర్యదృష్టికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రాపంచిక వాస్తవికత పట్ల ఎరుకతోనే ఉన్నారని కవి, రచయిత నామాడి శ్రీధర్ అన్నారు. కవి తన బాల్య, యౌవనకాలాల జ్ఞాపకాలతో పాటు సామాజిక ఘటనలు, రాజకీయ పరిణామాలను కవిత్వీకరించారని ఆయన ప్రశంసించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బార్ అసోసియేషన్ భవనంలో శనివారం ఉదయం జరిగిన బడుగు భాస్కర్ జోగేష్ కవితాసంపుటి ‘లిదియా పూలు సలామీ అఖాతం’ ఆవిష్కరణ సభలో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి, సభకు అధ్యక్షత వహించారు. అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాది సి.హెచ్.అజయ్ కుమార్ సభలో గౌరవ అధ్యక్షులుగా పాల్గొన్నారు. కవి మాతృమూర్తి ఈశ్వరమ్మ తొలి ప్రతి స్వీకరించారు.
ప్రధాన వక్త, కవి , సాహిత్య విమర్శకులు సుంకర గోపాల్ మాట్లాడుతూ ‘లిదియా పూలు సలామీ అఖాతం’ కవిత్వ సంపుటిలో అనుభూతి భావుకత, సామాజిక పరిణామాల చిత్రీకరణ ఉంది. జీవితం పట్ల ఒక తాత్విక తార్కిక దృక్పథం ఉంది. గాడత స్పష్టత ఉన్న అరుదైన కవి జోగేష్ అని కొనిఆడారు. వయూద్వేగాల ప్రకంపనను భాషగా మార్చడంలో కవి విజయవంతం అయ్యారని వివరించారు.మరొక వక్త,కవి,రచయిత అవధానుల మణిబాబు మాట్లాడుతూ జోగేష్ ప్రతి కవితా ఆవరణలుగా విస్తరించి ఉంటుందని అన్నారు. పైకి ప్రస్ఫుటంగా కనిపించే భావం మాత్రమే కాక అంతర్లీనంగా చెప్పిన సంగతులకోసం ఏకాగ్రతతో చదవాల్సిన కవిత్వం ఇదని తెలిపారు. తనదైన శైలి,శిల్పం, శబ్దాలతో ఎంచుకున్న అంశాన్ని అద్భుత కవితగా మలచే ఇంద్రజాలం ఈ కవిలో ఉందని ప్రశంసించారు. చదివిన తర్వాత మననం చేసుకుంటే కవితలలో సన్నివేశం పాఠకులకు దృశ్యమానం అవుతుందని వివరించారు. ప్రతి కవితలో ఆయన విస్త్రృత అధ్యయనం కనిపిస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో
ప్రముఖ కవులు, రచయితలు మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, దాట్ల దేవదానం రాజు, కొండూరి రామరాజు, ఎమ్మెస్ సూర్యనారాయణ, మిరప మహేష్, మోకా రత్నరాజు తదితరులు ఆత్మీయవచనాలు చెప్పారు. కవి బడుగు భాస్కర్ జోగేష్ తన కవిత్వనేపథ్యాన్ని వివరించారు. ఈ సభలో నుంచే నాగ సత్యనారాయణ,,మధునాపంతుల చలపతి, ముక్కామల చక్రధర్,చెల్లి రవి,గౌరవ్ ,ముత్యాల శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాదులు డి.బి.లోక్,ఎండి.అజామ్ అడపా ప్రసాద్, నంబూరి మూర్తి,,కుడిపూడి అశోక్,వనుము చంద్రశేఖర్, నందెపు చిన్న,నందిక శ్రీనివాస్ డి.చిరంజీవి, సుధాకర్ సాహిత్యకారులు తదితరులు పాల్గొన్నారు.